
ప్రకాశం, 28 ఆగస్టు (హి.స.)
,జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా రూ.100 కోట్ల పెట్టుబడితో చదలవాడలో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పీ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాడిసన్ హోటల్ నిర్మాణం జరుగనుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి అంతర్జాతీయ బ్రాండెడ్ 5-స్టార్ హోటల్. 151 విలాసవంతమైన గదులు, మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ను నిర్మించనున్నారు.
ఎంఐసీఈ(MICE), బిజినెస్ టూరిజానికి ఊతమిచ్చేలా 2,100 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో బ్యాంకెట్ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. NH-16కు ఆనుకుని హోటల్ నిర్మాణంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు మరింత సౌకర్యం కలగనుంది. రాడిసన్ హోటల్తో స్థానిక యువతకు హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం కార్యకర్తలు, అభిమానులతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో ఫొటోలు దిగుతూ, అర్జీలను స్వీకరించారు. మహిళా కార్యకర్తలు.. లోకేశ్కు రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ