
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఈ) బొజ్జ జయరాజ్ (Bojja Jayaraj)ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అధికారికంగా అరెస్ట్ (arrest) చేశారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో గురువారం హైదరాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, తాండూరు సహా 12 ప్రాంతాల్లో నిర్వహించిన విస్తృత సోదాల్లో జయరాజ్, ఆయన బినామీల పేరిట మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.65 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, స్థలాలు, ఖరీదైన లగ్జరీ కార్లు, పెద్ద ఎత్తున బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
సోదాలు, విచారణ అనంతరం జయరాజ్ను అదుపులోకి తీసుకున్న అధికారులు, వైద్య పరీక్షల అనంతరం ఆయనను వరంగల్లో లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, భారీ భద్రత నడుమ అధికారులు జయరాజ్ను వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా, మైనింగ్ విభాగంలో అక్రమార్జనకు పాల్పడి ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడం అధికార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ఉన్న మరికొందరు బినామీలు, సహకరించిన వ్యక్తుల పాత్రపై కూడా అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..