కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు

భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'హట్టి గోల్డ్ మైన్స్ ('Hatty Gold Mines) ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా భూగర్భ(అండర్గ్రౌండ్), ఓపెన్కాస్ట్ గనులతో పాటు అక్కడి ప్రొడక్షన్ యూనిట్లు, బంగారం శుద్ధి కేంద్రాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మైనింగ్, శుద్ధి ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థను కేవలం సంప్రదాయ బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా, బంగారం, రాగి వంటి కీలక లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తి రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వాణిజ్య వేలంలో సింగరేణి సంస్థ కర్ణాటకలోని దేవ దుర్గ బంగారం, రాగి బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకున్న విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. దేవదుర్గ బ్లాక్లో చేపట్టబోయే ఖనిజాల వెలికితీత, అన్వేషణ ప్రక్రియలకు హట్టి గోల్డ్ మైన్స్ సాధించిన సుదీర్ఘ అనుభవం, వారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కొత్త మైనింగ్ ప్రాజెక్టుల ద్వారా సంస్థ సామర్థ్యం పెరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దేశ ఖనిజ సంపదను పెంపొందించడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande