
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో ఇటీవల జరిగిన చోటు చేసుకుంటున్న పలు పోలీసు వ్యవహారాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలతో పాటు ప్రతిపక్షాలపై కూడా పోలీసుల ద్వారా ఒత్తిడి, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందా? లేక పోలీసు పాలన సాగుతోందా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
మహబూబాబాద్లో ఓ పాలిటెక్నిక్ విద్యార్థి పట్ల పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారనే ఘటన, నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై దౌర్జన్యం జరిగిందనే ఆరోపణలు, సూర్యాపేటలో సామాజిక మాధ్యమాల పోస్టులపై కేసులు నమోదు చేశారన్న అంశాలను హరీశ్ రావు ప్రస్తావించారు. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు ఘటనపై నిరసన తెలిపిన వారిపై పోలీసు అధికారి దౌర్జన్యంగా ప్రవర్తించారనే ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, నిరసన తెలిపే వారిని అరెస్టు చేయడం, హక్కుల కోసం గొంతెత్తిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం జరుగుతోందని హరీశ్రావు ఆరోపించారు. “ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రతిపక్షాలపై ఒక రకంగా, సామాన్య ప్రజలపై మరో రకంగా పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
రాష్ట్ర డీజీపీ ఈ ఘటనలపై దృష్టి సారించాలని హరీశ్రావు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులు, గౌరవం కాపాడేలా పోలీసు వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..