కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.. కేటీఆర్ పిలుపు..
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట.. కేటీఆర్ పిలుపు..
KTR


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స) కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని ఆయన సూచించారు.

ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని కేటీఆర్ సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande