
నాగర్ కర్నూల్, 28 ఆగస్టు (హి.స.)
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి
రాతపూర్వకంగా దరఖాస్తు చేసి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపించినప్పుడు అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అధికారులు తమ పనితీరులో మార్పు తీసుకురావాలని సూచించారు. శుక్రవారం పానగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజా సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రజలు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులు, వాటిలో పరిష్కరించిన సమస్యలు, ఇంకా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై మంత్రి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు