
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
రాఖీ పౌర్ణమి (Rakhi Purnima)
పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళామణులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల నేపథ్యంలో జూబ్లీహిల్స్లోలోని సీఎం నివాసంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రులు సీతక్క మరియు కొండా సురేఖ(Seethakka & Konda Surekha) ఇవాళ ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఇటీవల కొండా సురేఖ బర్తరఫ్ కానున్నారనే ఊహాగానాలు, రాజకీయ వివాదాలు చెలరేగిన నేపథ్యంలో.. సీతక్కతో కలిసి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రత్యేక ఆసక్తిని నింపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులకు సోదరుడిగా నిండు మనసుతో ఆశీస్సులు అందించారు. అదేవిధంగా సీఎంకు రాఖీ కట్టిన వారిలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్పేట్లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు