ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీ.. బస్సులు లేక ఇబ్బంది పడుతున్న జనం
ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీ.. బస్సులు లేక ఇబ్బంది పడుతున్న జనం
Rakhi


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) వరుస సెలవులతో నగరంలోని రోడ్లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. రాఖీ పౌర్ణమిని పురస్కరిం చుకుని సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు ఊర్లకు పయనమయ్యారు. వరుస సెలవులు రావడంతో నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్టాండ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ.. దాదాపు 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

అయితే సరిపడా బస్సులు లేక వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రతి బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో తరలి వెళ్లడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీనికి తోడు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బాదుడు షురూ చేయడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. కాగా, స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించామని, దూరాన్నిబట్టి 30 -50 శాతం పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని ఆర్టీసీవర్గాలు తెలిపాయి. 'స్పెషల్ బస్' అని రాసిలేని బస్సుల్లో అదనపుచార్జీలు వసూలు చేస్తే ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande