
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని సాగర్ హైవేపై శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు వాహనాలు బారులు తీరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రద్దీని నియంత్రించాల్సిన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై వాహనదారులు, స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇబ్రహీంపట్నంలో ఉదయం నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా సాగర్ హైవేపై వాహనాల సంఖ్య పెరగడంతో ప్రధాన కూడళ్ల వద్ద పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ వాహనాలను క్రమబద్ధీకరిస్తే ట్రాఫిక్ సమస్యను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రజలు చెబుతున్నారు.
ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే సిబ్బంది కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు పోలీసులు రోడ్లపై కనిపించరా? ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు