
నల్గొండ, 28 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న ఆవులు, లేగదూడల వాహనాన్ని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, గోరక్షా కార్యకర్తలు స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వాహనాన్ని గోరక్ష కార్యకర్తలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో 3 ఆవులు, 10 లేగదూడలు మొత్తం 13 గోవులు ఉన్నట్లు గుర్తించారు. వాహనదారులను విచారించగా, ఈ గోవులను ఏపీలోని తుని నుంచి హైదరాబాద్లోని బహదూర్పురా ప్రాంతానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు.
వెంటనే కార్యకర్తలు డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోచంపల్లి పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం రక్షించిన 13 గోవులను సంరక్షణ నిమిత్తం రంగారెడ్డి జిల్లా జాఫర్గూడలోని యుగ తులసి ఫౌండేషన్ గోమహాక్షేత్రం గోశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగన్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు