ప్రసాదాల విషయంలో ఇబ్బందులు...అరిసవెల్లి క్షేత్రంలో భక్తులకు తప్పని బాధలు
ప్రసాదాల విషయంలో ఇబ్బందులు...అరిసవెల్లి క్షేత్రంలో భక్తులకు తప్పని బాధలు
సూర్యుడు


అరసవల్లి, 03 ఆగస్టు (హి.స.)

అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులు ప్రసాదాల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు పరిమితంగానే లడ్డూ, పులిహోర విక్రయిస్తున్నారు. ఎక్కువ కావాలంటే ఆన్లైన్లో నగదు చెల్లించాలని చెబుతుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్యాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కొన్నిరోజుల నుంచి ఒక్కో భక్తుడికి నేరుగా నగదుపై రెండేసి చొప్పున లడ్డూలు, పులిహోర మాత్రమే విక్రయిస్తున్నారు. అదనంగా కావాలంటే మన మిత్ర యాప్ లేదా ప్రసాదాల కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఆన్లైన్ చెల్లింపులకు అవకాశం లేనివారు.. అవసరమైనన్ని ప్రసాదాలు పొందలేకపోతున్నారు. ఈ విషయమై తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఆదాయంపైనా ప్రభావం.. ఆలయానికి ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదాయం బాగానే సమకూరుతోంది. 150 గ్రాముల పులిహోర ప్యాకెట్ ధర రూ.10. వీటి ద్వారా ఏడాదికి రూ.1.10 కోట్లు, రూ.15 ధర కలిగిన 80 గ్రాముల లడ్డూల అమ్మకంతో రూ.84 లక్షల వరకు వస్తోంది. ప్రస్తుతం విధానం ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande