హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్.. పోలీసుల కేసు నమోదు
హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Star hospital


హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ డేటా లీక్ (Hyderabad, Star Hospitals Data Leak) ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదైంది. ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులు లీక్ అయినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఆస్పత్రి అంతర్గత గోప్య సమాచారాన్ని కూడా ఓ వెబ్సైట్లో ఉంచినట్లు చెప్పుకొచ్చారు. ఆ వెబ్సైట్లోకి ప్రవేశించే లాగిన్ క్రెడెన్షియల్స్ వాట్సాప్లో షేర్ చేసినట్లు వెల్లడించారు.

రోగులతో పాటు ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం కూడా లీక్ అయినట్లు ఆరోపించారు. డేటా లీక్ కారణంగా గుర్తింపు చోరీ, ఆర్థిక మోసాలు, వేధింపులు జరిగే ప్రమాదం ఉందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నారు. డేటా లీక్కు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హాస్పిటల్ సీఈవో కోరారు. ఆ వెబ్సైట్ను వెంటనే బ్లాక్ చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. సర్వర్ లాగ్స్, మెటా డేటా వంటి డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని ఆస్పత్రి సీఈవో రాహుల్ మెడక్కర్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande