
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన 'రంగం' (భవిష్యవాణి) కార్యక్రమం నేడు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. పచ్చి మట్టి కుండపై నిలబడిన మాతంగి స్వర్ణలత... అమ్మవారి రూపంలో పూనకంతో భవిష్యత్తును వినిపించారు. ఈ ఏడాది జోష్యంలో అమ్మవారు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయడం భక్తులను ఒకింత ఆందోళనకు గురిచేసింది. రెండు నెలల క్రితమే ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని మొక్కుకుని మాట తప్పారని, ఇప్పటివరకు ఆ పని ఎందుకు పూర్తి చేయలేదని ఆలయ అధికారులను, పూజారులను అమ్మవారు నిలదీశారు. రాబోయే ఆరు నెలల లోపు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో వాడవాడలా తీవ్ర ప్రాణనష్టం కలిగిస్తానని గట్టిగా హెచ్చరించారు. విగ్రహ ప్రతిష్ఠకు కొందరు అడ్డుపడుతున్నారని పూజారులు అమ్మవారి దృష్టికి తీసుకురాగా, అడ్డుపడేవారు ఎంతటి వారైనా సరే తానే స్వయంగా చూసుకుంటానని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల గురించి చెబుతూ ఈ ఏడాది రాష్ట్రంలో భారీ కుంభవృష్టి కురుస్తుందని, పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని జోష్యం చెప్పారు. సమాజంలో మనుషులు వావివరసలు మర్చిపోయి అహంకారంతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తాను సంతోషంతో రాలేదని, క్రోధంతోనే వచ్చానని చెబుతూనే... తనను నమ్ముకున్న ప్రజలను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటానని అమ్మవారు అభయమిచ్చారు. ఈ రంగం కార్యక్రమాన్ని తిలకించడానికి ఆలయ పరిసరాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్