మండల స్థాయిలోనే రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
మండల స్థాయిలోనే రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Collector


జోగులాంబ గద్వాల, 03 ఆగస్టు (హి.స.)

ప్రజావాణికి వచ్చే ఆర్జీలను పెండింగ్లో

ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.

ఈ వారం మొత్తం 70 ఫిర్యాదులు ప్రజావాణిలో అందాయని కలెక్టర్ తెలిపారు. గత కొన్ని వారాలుగా వచ్చిన ఆర్జీల పరిష్కారంలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాతో పాటు సీఎం ప్రజావాణికి వచ్చిన ఆర్జీలను కూడా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

మండల స్థాయిలో వచ్చిన ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించాలని, ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండలాల రెవెన్యూ అధికారులు త్వరితగతిన పరిష్కరిస్తే ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

గతంలో ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కాకపోవడంతో పలువురు ప్రజలు అదే సమస్యలపై మళ్లీ ప్రజావాణికి వస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే, ప్రతి శాఖ అధికారి ప్రతి బుధవారం తమ సిబ్బందితో సమావేశం నిర్వహించి, తమ శాఖ పరిధిలో వచ్చిన ప్రజావాణి ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande