
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ వేతన పెంపునకు సంబంధించి కీలక అప్డేట్ రానే వచ్చింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు కేంద్రం ప్రతి ఏటా రెండుసార్లు ఉద్యోగులకు కరువు భత్యం (Dearness Allowance - DA) రూపంలో వేతన పెంపును అందిస్తోంది. అందులో భాగంగా జులై విడతకు సంబంధించిన డీఏ పెంపుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయతే ఈ డీఏ పెంపును కార్మిక శాఖ విడుదల చేసే ఆలిండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) గణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈసారి వెలువడిన వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 60 శాతం డీఏను పొందుతున్నారు. ఇప్పుడు ప్రకటించబోయే 3 శాతం పెంపుతో డీఏ రేటు 60 శాతం నుంచి 63 శాతానికి చేరనుంది. కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపిన వెంటనే కొత్త వేతనాలు అమలుల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..