
ఖమ్మం, 03 ఆగస్టు (హి.స.)
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ముఖ్య అతిథి ప్రసంగాన్ని ఆగస్టు 11 నాటికి సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి శాఖ తమ శాఖలో చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షిప్తంగా పొందుపరిచిన నివేదికలను ఆగస్టు 8 లోగా డీపీఆర్వోకి అందజేయాలని ఆదేశించారు. సౌండ్ వ్యవస్థ ఏర్పాట్ల బాధ్యతను ఖమ్మం అర్బన్ తహసీల్దార్ చేపట్టాలని, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లను డీపీఆర్వో ముందస్తుగా పరిశీలించి నిర్ధారించాలని సూచించారు.
ప్రతి శాఖ నుంచి ప్రశంసా పత్రాల కోసం ఇద్దరు ఉద్యోగుల పేర్లను మాత్రమే ప్రతిపాదించాలని, వారి సేవా చరిత్ర మంచిగా ఉండాలని స్పష్టం చేశారు. వేదికపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని మినిట్ టు మినిట్ వారీగా కార్యక్రమ పట్టికలో పొందుపరిచి ముందుగానే ఖరారు చేయాలని, కార్యక్రమ వ్యాఖ్యాతకు పూర్తి కార్యక్రమంపై ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్య అతిథి రాకముందే అందరూ తమ స్థానాల్లో కూర్చునేలా చూడాలని ఆదేశించారు. స్టాల్స్ను ఆగస్టు 15 ఉదయం 6 గంటలకల్లా సిద్ధం చేయాలని,సాంస్కృతిక కార్యక్రమాల్లో వినిపించే పాటలను ముందుగానే ఎంపిక చేసి ఒక్కో పాట మూడు నుంచి నాలుగు నిమిషాలకు మించకుండా చూడాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు తాజా నివేదికలతో వేడుకలకు హాజరు కావాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు