నిమ్స్ హాస్పిటల్ మరో ఘనత.. వెయ్యి మందికి రొబోటిక్ సర్జరీలు
నిమ్స్ హాస్పిటల్ మరో ఘనత.. వెయ్యి మందికి రొబోటిక్ సర్జరీలు
Nims


హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)

నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతనుసాధించింది. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే నిమ్స్ హాస్పిటల్లో 1,000 రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిసిన డాక్టర్ రాహుల్ దేవరాజ్, నిమ్స్ సాధించిన ఈ ఘనతను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్తో పాటు రొబోటిక్ సర్జరీల్లో భాగస్వాములైన డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిమ్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇటీవలే నిమ్స్ లో 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తవడం, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం ప్రభుత్వ వైద్యరంగ సామర్థ్యానికి నిదర్శనమని మంత్రి అన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించిన నిమ్స్, దేశంలోనే ప్రముఖ అవయవ మార్పిడి కేంద్రాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సేవలను మరింత విస్తరిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నిమ్స్ పాటు ఎంఎన్నో క్యాన్సర్ హాస్పిటల్లో కూడా రొబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న కొత్త టిమ్స్ హాస్పిటళ్లతో పాటు గాంధీ, కొత్త ఉస్మానియా హాస్పిటల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ రంగంలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. నిమ్స్ ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషమని తెలిపారు. దీంతో ఖరీదైన రొబోటిక్ సర్జరీలను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలిగామని చెప్పారు. ఈ విజయానికి యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియా విభాగాలు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందం, ఇతర సహాయక విభాగాల సమిష్టి కృషి కారణమని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. రాష్ట్రంలో ఆధునిక వైద్య సేవల బలోపేతానికి నిరంతరం సహకరిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా డాక్టర్ రాహుల్ దేవరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించే దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.

నిమ్స్ ఆసుపత్రిలో కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ సహా వైద్య, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బందికి సోమవారం ఒక ప్రకటనలో ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు సైతం అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande