
నల్గొండ, 03 ఆగస్టు (హి.స.)
అభివృద్ధే లక్ష్యంగా అధికారులు
సర్పంచులతో సమన్వయంతో పనిచేయాలని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) సూచించారు. సోమవారం మదనాపురం మండల కేంద్రంలో ఎంపీడీవో ప్రసన్నకుమారి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా సర్పంచులు తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అయితే, పలు శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే జీఎంఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే కూరగాయల సాగు, ప్రస్తుత సీజన్లో ప్రబలే వ్యాధుల నివారణ చర్యలు, అలాగే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాంటి వారి వివరాలను గ్రామసభల్లో తీర్మానించి పంపించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు