భూ వివాదాలకు గుడ్బై.. డిజిటల్ రీ-సర్వేతో కొత్త రికార్డులు సిద్ధం..!
భూ వివాదాలకు గుడ్బై.. డిజిటల్ రీ-సర్వేతో కొత్త రికార్డులు సిద్ధం..!
Digital


మహబూబాబాద్, 03 ఆగస్టు (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా

కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను తిరిగి కొలిచి డిజిటల్ రికార్డులను సిద్ధం చేయనుంది. ఈ ప్రక్రియ ద్వారా భూ యజమానుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, ప్రతి భూమికి ప్రత్యేక భూదార్ గుర్తింపు సంఖ్య (Bhudhaar ID) కేటాయించనున్నారు.

ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని ప్రతి మండలానికి సుమారు రూ.9 లక్షల విలువైన ఆధునిక సర్వే పరికరాలను ప్రభుత్వం అందించింది. ఈ యంత్రాలతో భూముల సరిహద్దులను అత్యంత ఖచ్చితంగా నిర్ధారించి, కొత్త డిజిటల్ రికార్డులు రూపొందిస్తారు. మొదటి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ప్రారంభమై, అనంతరం దశలవారీగా అన్ని రెవెన్యూ గ్రామాలకు విస్తరించనున్నారు. గ్రామ సభల ద్వారా రైతుల అభ్యంతరాలు, సందేహాలను స్వీకరించి పరిష్కరిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించడం, డిజిటల్ భూ రికార్డులు రూపొందించడం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లి, రావిగూడెం, బూరుగుపాడు, గుర్రాలకుంట గ్రామాలను మొదటి విడతలో ఎంపిక చేశారు. రీ-సర్వే పూర్తయ్యాక ప్రతి భూ కమతానికి ప్రత్యేక ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (LPM) సిద్ధం చేసి, కొత్త భూదార్ గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. భూమి కొనుగోలు, విక్రయం, వారసత్వ మార్పులు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో ఈ డిజిటల్ రికార్డులు కీలకంగా ఉపయోగపడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande