రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం: డిఫ్తీరియా, టెటానస్ నివారణే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం: డిఫ్తీరియా, టెటానస్ నివారణే లక్ష్యం
ap


హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, యువతను ప్రమాదకర బ్యాక్టీరియా వ్యాధుల నుండి రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక రోగనిరోధక శక్తి పెంపు ప్రచారాన్ని ప్రారంభించింది. ఆగస్టు 3 నుండి ఆగస్టు 8 వరకు వారం రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ముఖ్యంగా డిఫ్తీరియా (గొంతువాపు), టెటానస్ (ధనుర్వాతం) వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి విద్యార్థులకు రక్షణ కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలలో ఈ ఉచిత వ్యాక్సినేషన్ క్యాంపులను వైద్య ఆరోగ్య శాఖ విస్తృతంగా నిర్వహిస్తోంది. అర్హులైన విద్యార్థులందరికీ టీకాలు వేసేలా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పాఠశాలల యాజమాన్యాలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడం ద్వారా విద్యార్థులలో రోగనిరోధక శక్తిని పెంచి, భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ముందస్తుగానే అడ్డుకోవచ్చని అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లలకు ఈ టీకాలు వేయించాలని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం కోరింది. పాఠశాలలకు రాని పిల్లలను, డ్రాపౌట్లను సైతం గుర్తించి స్థానిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ టీకాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వర్షాకాలంలో ఇలాంటి బ్యాక్టీరియా వ్యాధులు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున, ఈ వారం రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande