అలల చెంత రీల్స్...ప్రమాదబారిలో యువత..బారికేడ్లు పెట్టాలని డిమాండ్
అలల చెంత రీల్స్...ప్రమాదబారిలో యువత..బారికేడ్లు పెట్టాలని డిమాండ్
sea


రామ్నగర్, :, 04 ఆగస్టు (హి.స.)

అలల చెంతన సెల్ఫీలు తీసుకుంటూ, రీల్స్ చేస్తూ పలువురు యువత ప్రమాదంలో పడుతున్నారు. ఈ విషయం తెలిసినా.. పోలీసులు హెచ్చరిస్తున్నా వినకుండా వెళ్లి గల్లంతవుతున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పాతగంగవరం బీచ్లో సరదాగా గడిపేందుకు ఏడుగురు స్నేహితులు వెళ్లారు. అక్కడ ఉన్న పెద్ద రాయి ప్రాంతంలో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఒక్క సారిగా వచ్చిన భారీ కెరటం ఇద్దరిని లాక్కెళ్లడంతో గల్లంతయ్యారు. అదే విధంగా ఆర్కే బీచ్లోని పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రాళ్లపై నిల్చుని సెల్ఫీలు, రీల్స్ చేస్తున్నారు. భారీ అలలు చుట్టుముడుతున్నా.. ప్రాణాలకు ముప్పు ఉన్నా..సరదాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

సోమవారం ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా అలల ఉద్ధృతి ఎక్కువగా కనిపించింది. ఇక్కడ రాళ్లపై నాచు ఉంది. దీన్ని పట్టించుకోకుండా యువత, సందర్శకులు సెల్ఫీలు, వీడియోల కోసం రాళ్లపైకి ఎక్కారు. కొందరు సముద్రానికి అతి సమీపంలో నిలబడి ఫొటోలు దిగగా, మరికొందరు రాళ్లపై విన్యాసాలు చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. అలలు ఒక్కసారిగా ఎగిసిపడే అవకాశం ఉందని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. అయితే అధిక సంఖ్యలో సందర్శకులు రాళ్లపైకి వెళ్తున్నా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా నిరోధించేందుకు బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande