
ఎండాడ,, 04 ఆగస్టు (హి.స.)
: విశాఖ కేంద్రంగా ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.52.16 లక్షలు కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠాకు సహకరిస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో ఓ విద్యాలయంలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా సంప్రదించారు. తాము అమెరికా స్టాక్మార్కెట్ నిపుణులమని నమ్మబలికారు. అనంతరం ‘స్టాల్టోరో ఇన్’ అనే నకిలీ ట్రేడింగ్ యాప్ను బాధితుడితో డౌన్లోడ్ చేయించారు. ప్రారంభంలో తప్పుడు లాభాలను చూపిస్తూ విశ్వాసం కల్పించారు. ఆ తర్వాత భారీ లాభాలొస్తాయనే ఆశ చూపి షేర్లు, ఐపీఓల పేరుతో పలుమార్లు పెట్టుబడులు పెట్టించి చివరకు రూ.51,25,000లకు మోసం చేశారు. ఇదే తరహాలో మరో బాధితుడు కూడా రూ.91,500లు కోల్పోయాడు. మొత్తంగా ఇద్దరు బాధితుల నుంచి రూ.52,16,500లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన విశాఖ సిటీ సైబర్ క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితుల నుంచి బదిలీ అయిన డబ్బులు ఇతర బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. కేవైసీ వివరాలు, టవర్ లొకేషన్ల ఆధారంగా హైదరాబాద్కు చెందిన సయ్యద్ ఆలీ అబ్బాస్ హుస్సేన్ జాఫ్రీ, షేక్ యూసఫ్, జాకీర్ హుస్సేన్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరు దుబాయ్లో తలదాచుకుంటున్న ఫయాజ్, సులేమాన్ తదితరులు పరారీలో ఉన్న నిందితుల సూచనల మేరకు పనిచేస్తున్నట్లు తేలింది. అధిక కమీషన్ ఆశతో కుటుంబసభ్యులు, స్నేహితుల బ్యాంకు ఖాతాలను సేకరించి ముఠాకు అందించారు. ఆ ఖాతాల్లో పడిన సైబర్ మోసాల నిధులను నగదుగా మార్చి యూపీఐ, డిమాండ్ డ్రాప్ట్, హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. నిందితులను న్యాయ స్థానంలో హాజరు పరచగా 14 రోజులు రిమాండు విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ