
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
తెలంగాణ ఆధ్యాత్మికత, జానపద సంస్కృతి, సామూహిక భక్తి సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలు భక్తి పారవశ్యంతో కళ కళ లాడుతున్నాయి. మహాకాళి అమ్మవారు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచ మ్మ, పెద్దమ్మతల్లి వంటి గ్రామదేవతల ఆరాధనకు అంకితమైన ఈ నెల రోజుల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వైభవంగా నిర్వహించబడతాయి. కృతజ్ఞత, భక్తి, సమాజ ఐక్యతకు ప్రతీ కగా నిలిచే ఈ పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు..
అమ్మవారు పుట్టింటికి రావడమే బోనాలు..
పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో మహాకాళి అమ్మవారు తన పుట్టింటికి విచ్చేస్తారని నమ్ముతారు. వివాహిత కుమార్తెను ఆప్యాయంగా ఆహ్వానించినట్లే భక్తులు అమ్మవారిని నైవేద్యాలతో స్వాగతిస్తారు.. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ 'బోనం'. కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో వండిన అన్నం, పాలు, బెల్లంతో తయారుచేసిన నైవేద్యాన్ని వేపాకులు, పసుపు, కుంకుమ, వెలిగించిన దీపంతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బోనాలను తలపై మోసుకుంటూ భక్తిశ్రద్ధలతో ఆలయాలకు చేరు కుంటారు. బోనాల ఉత్సవాలకు ఊరేగింపులు, డప్పుల మోత, జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ. అమ్మవారి ఆవాహన కలిగిందని విశ్వసించే కొందరు మహి ళలు భక్తి పారవశ్యంలో నృత్యాలు చేస్తారు. వారి పాదాలపై భక్తులు నీరు పోసి నమస్కరించడం ఆనవాయితీ.
ఇక పసుపు, కుంకుమ, గంటలతో అలంకరించబడిన పోతురాజు దేవత సోదరుడిగా భావించబడుతూ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తారు.. అతని ఉత్సాహభరితమైన నృత్యం దుష్టశక్తులను పారదోలుతుందని భక్తుల విశ్వాసం. పండుగ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.. చివరి రోజు అమ్మ వారికి ప్రతీకగా భావించే అలంకరించిన ఘటాన్ని జానపద కళారూపాలు, డప్పు వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ ఘనంగా ఊరేగించి నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి..
చరిత్రకెక్కిన హైదరాబాద్ బోనాలు..
తెలంగాణ వ్యాప్తంగా బోనాలు ఘనంగా నిర్వహించబడుతున్నప్పటికీ, హైదరాబాద్లోని వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సికింద్రాబాద్లో నిర్వహించే లష్కర్ బోనాలు విశేష ఖ్యాతిని పొందాయి.. ఎదురుకోలుతో ప్రారంభమై, అమ్మవారి గృహప్రవేశాన్ని సూచించే కార్యక్రమాలు, రంగం నిర్వహణ, ఘటం నిమజ్జనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.. ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో నిర్వహించే రంగం సందర్భంగా ఎరుపుల స్వర్ణలత అమ్మవారి సందేశాన్ని భక్తులకు తెలియ జేస్తారు. అక్కన్న-మాదన్న ఆలయం నుంచి ఏనుగుపై తీసుకువెళ్లే ఘటం ఊరేగింపు నయాపూల్ వరకు సాగుతూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వేపాకులతో అలంకరించిన వీధులు, జానపద గీతాలు, కళారూపాలు పండుగకు ప్రత్యేక శోభను చేకూరుస్తాయి.. అమ్మవారికి సమర్పించే వెదురు, రంగు కాగి తాలతో తయారుచేసిన తొట్టెలు, గన్జఫౌండ్రీ ముత్యాలమ్మ ఆలయంలో రెండు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు ఈ పండుగ వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తాయి..
గన్ ఫౌండ్రీ, కలసిగూడ వంటి ప్రాంతాల్లో ఆషాఢం అనంతరం శ్రావణ మాసంలో కూడా బోనాలు నిర్వహించడం స్థానిక సంప్రదాయాల ప్రత్యేకతను తెలియజేస్తుంది. లాల్ దర్వాజా నుంచి నయాపూల్ వరకు జరిగే ఘటం ఊరేగింపులను వీక్షించేందుకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలివస్తారు.. భక్తి, విశ్వాసం, సంస్కృతి, సామాజిక ఐక్యతలను ఒకే వేదికపై ప్రతిబింబించే బోనాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచాయి. మహాకాళి అమ్మవారిపై ప్రజలకున్న అపారమైన విశ్వాసాన్ని, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసే శక్తిని ఈ మహోత్సవం సజీవంగా ప్రతిబింబిస్తోంది. ఆషాఢ మాసం అంతటా హైద రాబాద్-సికింద్రాబాద్లోని ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూనే, తెలంగాణ గొప్ప సాంస్కృతిక వార సత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.. భక్తి, జానపద కళలు, సంప్రదాయాలు, సామాజిక ఐక్యత సమ్మేళనమైన బోనాలు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే మహోన్నత సాంస్కృతిక ఉత్సవంగా చిరస్థాయిగా నిలిచిపోతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..