ఫ్యాబ్రిక్ డై, సింథటిక్ కలర్స్తో మసాలాల తయారీ: సీపీ సజ్జనార్
హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశామని భాగ్యనగర సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
Sajjanar


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేశామని భాగ్యనగర సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజల సమాచారం ఆధారంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని చెప్పుకొచ్చారు. 25 టన్నులకుపైగా కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కల్తీ మసాలాల కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని అన్నారు. మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు గుర్తించామని తెలిపారు.

ఆ మసాలాల్లో హానికర రసాయనాలు..

ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్తో మసాలాల తయారీ చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రీయల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా విక్రయిస్తున్నారని చెప్పుకొచ్చారు. 89 టన్నులకుపైగా ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ మసాలాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని వెల్లడించారు.

ఈ మసాలాలతో కేన్సర్..

కల్తీ ఆహారం వల్ల కాలేయం, మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మసాలాలతో కేన్సర్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదమని తెలిపారు. H- FAST ఏర్పడిన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని అన్నారు. 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 246 టన్నుల కల్తీ ఆహారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద ఆహారంపై వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande