
ములుగు, 04 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం
విద్యా వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ పెద్దపీట వేస్తుందని, పలు రకాల వ్యాధులతో బాధపడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి నూతన సదరం శిబిరం, యుడిఐడి భవనాన్ని, ఆక్సిజన్ ప్లాంట్, అర్డో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్ విభాగాలకు సంబంధించిన నాలుగు ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా ఆసుపత్రి ఇరుకుగా ఉన్న కారణంగా మరో ఆసుపత్రి ఏర్పాటుకు చూపుతున్నామని అన్నారు.
గతంలో కన్నా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందడం ఆశించదగ్గ విషయమని, ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు