
కరీంనగర్, 04 ఆగస్టు (హి.స.)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ల డిప్యూటేషన్లు, విధుల కేటాయింపు, అలవెన్సుల చెల్లింపులో కొనసాగుతున్న అసమానతలు పేదలకు అందాల్సిన వైద్య సేవలపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కనిపిస్తున్న ఈ పరిస్థితి ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లోనూ కొనసాగుతోందని నర్సింగ్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.2024 బ్యాచ్లో ప్రభుత్వం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సుమారు 200 మంది నర్సింగ్ ఆఫీసర్లను నియమించింది.
రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి నర్సింగ్ ఆఫీసర్పై ఉందని వారు పేర్కొంటున్నారు. అయితే ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న నర్సింగ్ పాఠశాల, నర్సింగ్ కళాశాలకు పలువురు నర్సింగ్ ఆఫీసర్లు డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నర్సింగ్ పాఠశాలలో సుమారు 8 మంది, నర్సింగ్ కళాశాలలో 7 మంది వరకు డిప్యూటేషన్పై కొనసాగుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. అక్కడ విధులు నిర్వహించే వారికి ఆస్పత్రుల్లో ఉండే మూడు షిఫ్టులు, నైట్ డ్యూటీలు, అత్యవసర సేవల భారం లేకపోయినా, ప్రత్యక్షంగా రోగులకు సేవలందించే నర్సింగ్ ఆఫీసర్లతో సమానంగా అదనపు హెచ్ఎస్ఏ, ధోబీ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ వంటి ప్రయోజనాలు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ఆస్పత్రి విధుల్లో నేరుగా పాల్గొనని సిబ్బందికి ఈ తరహా అలవెన్సుల చెల్లింపును ప్రభుత్వం సమీక్షించి, విధుల స్వభావానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో ప్రత్యక్షంగా రోగులకు సేవలందించే నర్సింగ్ ఆఫీసర్లు మూడు షిఫ్టులు, నైట్ డ్యూటీలు, అత్యవసర సేవలతో నిరంతరం అధిక పని భారం మోస్తున్నారని చెబుతున్నారు. డ్యూటీ రోస్టర్లోనూ సమానత్వం లేకపోవడంతో కొందరికి తరచూ నైట్ డ్యూటీలు పడుతుండగా, మరికొందరికి రెండేళ్లలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నైట్ డ్యూటీలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం నర్సింగ్ పాఠశాలలో కేవలం ముగ్గురు లేదా నలుగురు నర్సింగ్ ఆఫీసర్లతోనే విధులు నిర్వహించేవారని, ప్రస్తుతం డిప్యూటేషన్పై ఉన్న వారి సంఖ్య దాదాపు పదిమందికి చేరిందని సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే నర్సింగ్ కళాశాలలో కూడా అవసరానికి మించి పలువురు డిప్యూటేషన్పై కొనసాగుతున్నారని అంటున్నారు.
ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన ప్రధాన ఉద్దేశ్యం పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తప్ప, ఆస్పత్రి సేవలకు దూరంగా ఉండి డిప్యూటేషన్ల ద్వారా అలవెన్సుల ప్రయోజనాలు పొందడం కాదని వారు పేర్కొంటున్నారు. ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రజలకు సేవలందించి వారి మన్ననలు పొందాల్సిన బాధ్యత ప్రతి నర్సింగ్ ఆఫీసర్పై ఉందని, డిప్యూటేషన్ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం వల్ల ఆస్పత్రుల్లో సిబ్బందిపై అదనపు పని భారం పడుతోందని ఆరోపిస్తున్నారు.వర్షాకాలంలో డెంగ్యూ, వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి నర్సింగ్ ఆఫీసర్కు సమానంగా డ్యూటీలు కేటాయిస్తూ పారదర్శక రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. కరీంనగర్తో పాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రులు మరియు రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా డిప్యూటేషన్ విధానం, అలవెన్సుల చెల్లింపు, డ్యూటీ రోస్టర్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలని నర్సింగ్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు