
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ ప్రాజెక్టును 2027 చివరికల్లా పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ముంపు సమస్యపై వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ ద్వారా ఎన్ని గ్రామాలు, ఎంత భూమి ముంపునకు గురవుతుందో లెక్కలు తేల్చడానికి సిద్ధమవుతోంది. పోలవరంపై తెలంగాణ ప్రాంతంలో గ్రామాలపై ఎంత వరకు ప్రభావం పడుతుందనే దానిపై సర్వే చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నందున కేంద్రానికి నివేదిక పంపించి, నిధులను రాబట్టుకోవాలని, ఇదంతా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే చేసుకోవాలని నిర్ణయించారు.
ఇందుకు ఐఐటీ హైదరాబాద్ వారితో సర్వే చేయించాలని నిర్ణయించారు. గతంలోనే ఐఐటీ హైదరాబాద్కుముంపు అంచనా సర్వే బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ సర్వే పనులు ముందుకు సాగలేదని సమాచారం. దీనికి వివిధ రకాల అంశాలు ముడిపడి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్తో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యాలను వివరించి వెంటనే సర్వే పనులు ప్రారంభించే విధంగా చూడనున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏడు మండలాలను ఏపీకి కేటాయించారు. అయినా కూడా తెలంగాణలోని పలు గ్రామాలు, భూములు ముంపునకు గురవుతాయని గుర్తించారు. దీనిపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ వాటర్కమిషన్ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే నిర్వహించారు. దానిలో 900 ఎకరాల వరకు భూమి ముంపునకు గురవుతుందని తేల్చారు. ఆ సర్వేను తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఆ సర్వే కాకుండా సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించి, దానిలో ఎన్ని గ్రామాలు, ప్రజలు, ఎకరాలు ముంపునకు గురవుతుందో తేల్చనున్నారు. ఆ నివేదికను కేంద్రానికి పంపించి వీటికి నష్టపరిహారం చెల్లించాలని కోరనున్నారు.
పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల నీరు ఒకేసారి వచ్చినా తట్టుకునే విధంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా 160 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి పనులు జరుగుతున్నా.. ఇంతవరకు పనులు మాత్రం పూర్తి కావడంలేదు. నిర్మాణ కంపెనీలు, కోర్టు కేసులు, డిజైన్లలో లోపాలు, వరద నీరు, ముంపు సమస్య తదితర కారణాలతో ఆలస్యమవుతూ వస్తుంది. మొదట 30 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునే విధంగా నిర్మించగా ఆ తరువాత నీటిపారుదల రంగ నిపుణులు, ప్రముఖులు 50 లక్షల క్యుసెక్కులకు పెంచాలని కోరడంతో ఆ తరువాత డిజైన్ మార్చారు. తెలంగాణ ప్రాంతంలో ఏడు మండలాలు ఉండే ముంపు ఎక్కువగా ఉండి, పక్క రాష్ట్రంగా ప్రాజెక్టు పనులకు అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపే విధంగా చేశారు. దీంతో ఆ ఏడు మండలాల ముంపు ప్రస్తుతం ఏపీకి పెద్దగా సమస్య కావడంలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ(పీపీఏ) ఏర్పాటు చేసి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..