
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.) ఐటీ హబ్గా పేరుగాంచిన రాయదుర్గం త్వరలోనే రుచుల కేంద్రంగా కూడా గుర్తింపు పొందనుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 50కిపైగా ఫుడ్ స్టాల్స్తో, ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీని కోసం సుమారు రూ.4 కోట్లను కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా మంజూరు చేసినట్లు సమాచారం. తుది పరిపాలనా అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు.
నాలుగు అంశాలతో..
పట్టణ జీవనశైలికి అనుగుణంగా ఆహారం, ఉపాధి, సంస్కృతి, పర్యాటకం నాలుగు అంశాలను సమన్వయం చేస్తూ ఈ ఫుడ్ హబ్ను అభివృద్ధి చేయనున్నారు. ఒకే ప్రాంగణంలో విభిన్న రకాల తెలంగాణ, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతోపాటు కూర్చునే వసతి, పార్కింగ్, పారిశుధ్య సదుపాయాలు కల్పించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆధునిక వ్యాపార నిర్వహణలో అవకాశాలు కల్పించి,స్థిరమైన ఆదాయ వనరును సృష్టించేలా ఫుడ్ హబ్ను రూపొందిస్తున్నామని సీఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవల్పమెంట్ విభాగం అదనపు కమిషనర్ వీవీఎల్. సుభద్రా దేవి తెలిపారు. ఆసక్తి ఉన్న కళాకారులతో జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, యువ కళాకారుల ప్రతిభా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్