
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
సీఎం మానసపుత్రిక మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మొదటి దశ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఏషియన్ డెవలప్మెంట్ (ఏడీబీ) నుంచి ఎప్పుడైనా లోన్ క్లియరెన్స్ వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. క్లియరెన్స్ వచ్చిన వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ టెండర్ ప్రకియ అంతా ఏడీబీ నిబంధనల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకుని దసరా పండుగ రోజున మూసీ పునరుజ్జీవనం పనులకు శంకుస్థాపన చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
మూసీ పునరుజ్జీవనం మొదటి దశకు రూ.4,500 కోట్ల రుణం ఇవ్వడానికి ఏడీబీ అంగీకరించిన విషయం తెలిసిందే. మొదటి దశ డీపీఆర్ను పరిశీలించడంతోపాటు సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి పలుమార్లు ఏడీబీ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చారు. ప్రాజెక్టు చేపట్టే ఏరియాల్లోనూ పరిశీలించారు. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతోనూ సమావేశమై చర్చించారు. చివరగా చిన్నచిన్న సందేహాలను పరిష్కరించడానికి గూగుల్ మీట్ ద్వారా రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చివరగా ఈ నెల 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా రూ.4,500 కోట్ల లోన్ ఇవ్వడానికి క్లియరెన్స్ ఇవ్వడంతోపాటు అధికారింగా లెటర్ జారీ చేయనున్నారు. దీంతోపాటు ఏడీబీ నిబంధనల ప్రకారమే టెండర్ ప్రక్రియను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సాధారణంగా ఏ ప్రాజెక్టుకు సంబంధించిన ఈపీసీ టెండర్లు పిలవడానికి 21 రోజులపాటు గడువు ఇస్తారు. కానీ ఏడీబీ రూల్స్ ప్రకారం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుకు 42 రోజులపాటు టెండర్ గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనుండడంతో ఏడీబీ సభ్యత్వం కల్గిన 68 దేశాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలు సైతం టెండర్లలో పాల్గొనే విధంగా వెసులుబాటు కల్పించే అవకాశముంది. అయితే ఏడీబీ లోన్ ఇచ్చే ఏ ప్రాజెక్టు పనుల్లోనైనా ఈ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్, భాగస్వామ్య శాఖల అధికారుల సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఏడీబీ ప్రతినిధులు ఈ నెల 15 లోగా రూ.4,500 కోట్ల రుణానికి క్లియరెన్స్ ఇవ్వనున్నారు. మరో 42 రోజుల టెండర్ ప్రక్రియ పూర్తి, ఏజెన్సీ ఫైనల్ చేయడానికి మరో 15 రోజులు పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ రోజున పనులకు శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు సైతం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..