సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ఇంటర్నెట్: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్ సేవల విస్తరణపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావే
Sridhar babu


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.) తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని అధికారులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్ సేవల విస్తరణపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్ణీత గడువులోగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు ఏకీకృత డిజిటల్ నెట్వర్క్ ఏర్పాటు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలు వినియోగిస్తున్న టీ-స్వాన్ (T-SWAN) నెట్వర్క్ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్కు బదిలీ చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు.

అలాగే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'ఇంటింటికీ ఇంటర్నెట్' కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande