
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
బ్రిక్స్ దేశాల మధ్య అవినీతి
నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విదేశాలకు తరలించిన అక్రమ ఆస్తుల రికవరీకి సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా హైదరాబాద్లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది.
బ్రిక్స్-2026 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 4, 5 తేదీల్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ రెండో సమావేశానికి నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు.
సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా సమావేశాన్ని ప్రారంభించనున్నారు. బ్రిక్స్ సభ్యదేశాల నుంచి సీనియర్ విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
జూన్లో వర్చువల్ విధానంలో నిర్వహించిన తొలి సమావేశం అనంతరం జరుగుతున్న ఈ ప్రత్యక్ష సమావేశంలో అంతర్జాతీయ స్థాయిలో అక్రమ ఆస్తుల రికవరీని వేగవంతం చేయడం, సరిహద్దులు దాటి జరిగే అవినీతిని అరికట్టేందుకు సమన్వయ వ్యవస్థను బలోపేతం చేయడం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం వంటి అంశాలపై సభ్యదేశాలు విస్తృతంగా చర్చించనున్నాయి. అవినీతి కేసుల్లో విదేశాలకు పారిపోయిన
నేరస్తుల ఆచూకీని గుర్తించడం, వారి అప్పగింత ప్రక్రియలో అనధికారిక సహకారాన్ని మెరుగుపరచడం కూడా సమావేశంలో ప్రధాన అంశంగా ఉండనుంది. అలాగే ఫిన్స్టిక్, డిజిటల్ ఆస్తుల వినియోగంతో తలెత్తుతున్న అవినీతి ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాలపై సభ్యదేశాలు తమ అనుభవాలను పంచుకోనున్నాయి. సదస్సులో భాగంగా ఆగస్టు 5న ఆవిష్కరణ, సాంకేతికతతో కూడిన నైతిక పరిపాలన అంశంపై ప్రత్యేక అనుబంధ కార్యక్రమం నిర్వహించనున్నారు. డిజిటల్ కొనుగోలు వ్యవస్థలు, పౌర భాగస్వామ్యం, సాంకేతికత ఆధారిత పారదర్శక పాలన, పరిపాలనలో నిజాయితీని పెంపొందించే ఆధునిక విధానాలపై ఇందులో చర్చించనున్నారు. భారత్ బ్రిక్స్ అధ్యక్షతన నిర్వహిస్తున్న చివరి అవినీతి నిరోధక కార్యాచరణ బృంద సమావేశం కావడంతో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. సభ్యదేశాల మధ్య సంస్థాగత సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, అవినీతి రహిత పాలన దిశగా ఉమ్మడి కార్యాచరణకు ఈ సమావేశం బలమైన పునాది వేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు