
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై పలు రకాల సేవా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకు పరిధిలోని సుమారు 30 లక్షల మంది మహిళలకు ఏటా రూ. 500 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరుతుందని అంచనా. జులై 1 నుంచి తీసుకున్న రుణాలకు ఈ రద్దు వర్తిస్తుంది.
గతంలో డ్వాక్రా సంఘాల రుణాలపై బ్యాంకులు రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేసేవి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), యూనియన్ బ్యాంకులు ప్రాసెసింగ్, తనిఖీ ఫీజులను నిలిపివేయగా, తాజాగా వాటి సరసన ఏపీ గ్రామీణ బ్యాంకు చేరింది. ఈ నిర్ణయంతో ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లెడ్జర్ ఫోలియో ఛార్జీలు, పాస్‌బుక్ అప్‌డేట్ ఫీజులు, ఎస్‌హెచ్‌జీ స్టేట్‌మెంట్ ప్రింటింగ్, నగదు నిర్వహణ ఛార్జీలు వంటివి పూర్తిగా రద్దయ్యాయి.
దీంతో పాటు రూ. 5 లక్షలు దాటిన రుణాలపై వడ్డీ రేటును 13 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. గతంలో రుణ మొత్తంతో సంబంధం లేకుండా 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉండేది. ఉదాహరణకు, రూ. 20 లక్షల రుణం తీసుకున్న బృందానికి ప్రాసెసింగ్ ఫీజు రద్దుతోనే ఏటా రూ. 10,000 ఆదా అవుతుంది. వడ్డీ రేటు తగ్గింపుతో మరో రూ. 15,000 వరకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతి మూడు నెలలకోసారి విధించే తనిఖీ ఫీజులు, ఇతర ఛార్జీల రూపంలో గతంలో ఏటా రూ. 10,000 వరకు భారం పడేది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల డ్వాక్రా సంఘాలలో 1.10 కోట్ల మంది సభ్యులు ఉండగా, ఒక్క ఏపీ గ్రామీణ బ్యాంకు పరిధిలోనే సుమారు 3 లక్షల సంఘాలు, 30 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయం లక్షలాది కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చనుంది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi