
తిరుమల, 04 ఆగస్టు (హి.స.) తిరుమల స్వామివారి భక్తులను ఈకామర్స్ వెబ్ సైట్ల మోసం చేస్తున్నాయి. వెబ్ సైట్లలో అధిక ధరలకు టీటీడీ అగరబత్తులను అమ్ముతున్నాయి. టీటీడీ అనుమతి లేకుండానే మూడింతకు ధర పెంచి మరీ విక్రయాలు జరుపుతున్నాయి. దీంతో టీటీడీ అగరబత్తులను అధిక ధరలకు అమ్ముతున్న వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇందులో కేవలం టీటీడీ ఉత్పత్తులే కాకుండా అచ్చం వాటిని పోలి ఉండే నకిలీ ఉత్పత్తులను సైతం అమ్ముతున్నారు. డిమాండ్ కు తగినట్టుగా రకరకాల పరిమళాలతో అగరబత్తులను తయారు చేయించి వెబ్ సైట్లో విక్రయాలు జరుపుతున్నారు.
అగరబత్తులతో పాటు ఓ చిన్నపాటి వస్తువు పెట్టడం, కాంబోలు అంటూ భక్తులను మోసం చేస్తున్నారు. సాధారణంగా టీటీడీ అగరబత్తి కాంబో ప్యాక్ ధర రూ.452.38గా ఉంది. కాగా ఈ కామర్స్ సైట్లో అమ్ముతున్న కాంబో ప్యాక్ ధర రూ.1035గా ఉంది. టీటీడీ ఆధ్వర్యంలో అమ్ముతున్న అగరబత్తులను స్వామివారి అలంకరణకు వినియోగించే పుష్పాలతో తయారు చేస్తారు. వీటిని అధికారిక టీటీడీ వెబ్ సైట్, కొన్ని ఆలయాల వద్ద అమ్ముతున్నారు. ప్రతి నెల వెబ్ సైట్ ద్వారానే కోటి వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు టీటీడీ ఉత్పత్తుల పేరుతోనే భక్తులను మోసం చేయడం ఆందోళనకరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV