
కడప , 04 ఆగస్టు (హి.స.) కడప నగరంలోని దండోరా కాలనీలో ఘోరమైన పరువు హత్యల ఘటన కలకలం రేపింది. కన్నకూతురితో పాటు భార్యను కూడా ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికుల సమాచారం ప్రకారం.. నిందితుడి కూతురు ఒక యువకుడిని ప్రేమించడమే ఈ ఘాతకానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కూతురి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తండ్రి, ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ విషయంలో భార్యతోనూ గొడవ జరగడంతో, ఆమెపై కూడా దాడికి దిగి ప్రాణాలు తీశాడు. ఒకే ఇంట్లో క్షణికావేశంలో ఇద్దరిని కడతేర్చిన ఆ వ్యక్తి.. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసులు గాలింపు..
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ జంట హత్యలకు కారణమా? లేక ఇతర వివాదాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV