
అమరావతి, 05 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో గుంటూరు జిల్లాలో ఇది ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 15.03 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన కేంద్ర ఆయుష్ శాఖ బృందం ఇక్కడ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ స్థలాన్ని 3నెలల్లో అభివృద్ధి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరగనున్నాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి’’ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రం... యోగా, ప్రకృతి వైద్య రంగంలో దేశంలోనే అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ఒకటిగా నిలవనుంది. యోగా, ప్రకృతి వైద్య విధానాలపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడం, వైద్యులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడం, ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ ప్రాంగణంలోనే 100 పడకల యోగా-ప్రకృతి వైద్య ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ