హరిత హోటల్లో APTDC చైర్మన్ నూకసాని బాలాజీ ఆకస్మిక తనిఖీ!
కర్నూలు వెంకటరమణ కాలనీలోని ఏపీటీడీసీ హరిత యూనిట్ను చైర్మన్ డా. నూకసాని బాలాజీ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కర్నూలు వెంకటరమణ కాలనీలోని ఏపీటీడీసీ హరిత యూనిట్ను చైర్మన్ డా. నూకసాని బాలాజీ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


కర్నూలు, 05 ఆగస్టు (హి.స.)

వెంకటరమణ కాలనీలోని ఏపీటీడీసీ హరిత యూనిట్ను ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ యాదవ్ ఈ రోజు ఉదయం ఆకస్మికంగా సందర్శించి, వసతి గదులు (Accommodation), రెస్టారెంట్తో పాటు యూనిట్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా అతిథులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ, పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హరిత యూనిట్లోని లాన్లు, ఉద్యానవనాలు, పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్న తీరును అభినందిస్తూ సిబ్బందిని ప్రశంసించారు.

అనంతరం యూనిట్ మేనేజర్కు పలు సూచనలు చేస్తూ, భవిష్యత్తులో యూనిట్ ఆదాయాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే యూనిట్ ఆక్యుపెన్సీ రేషియో (Occupancy Ratio) 85 శాతానికి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టి, అతిథులకు మరింత నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

ఉద్యోగులతో ఆత్మీయంగా మాట్లాడిన చైర్మన్ డా. నూకసాని బాలాజీ యాదవ్, ఏపీటీడీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా, ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ (Gratuity) చెల్లింపుల అంశాన్ని త్వరలో నిర్వహించనున్న బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు.

పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్న ఆయన, అహోబిలం హరిత యూనిట్లో ల్యాండ్స్కేపింగ్ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మహానంది హరిత యూనిట్ అభివృద్ధి కోసం సమగ్ర పునరుద్ధరణ (Renovation) ప్రతిపాదనలను (Proposal) సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సూపరింటెండింగ్ ఇంజినీర్ (SE) గారిని ఆదేశించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ శ్రీ జి. లక్ష్మి నారాయణ, యూనిట్ మేనేజర్, ఇంజినీరింగ్ అధికారులు, ఏపీటీడీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీ రాజశేఖర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande