
పుంగనూరు, ఆగస్టు 06: అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉద్రిక్తతకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌లో భారీగా అవకతవకలు జరిగాయంటూ పుంగనూరు ముడెప్ప సర్కిల్ వద్ద వైసీపి శ్రేణులు ఈ దీక్షకు దిగాయి. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై, దీక్షలో కూర్చున్న నాయకులకు, అభ్యర్థులకు తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ నిర్వహణ, పోస్టుల కేటాయింపు ప్రక్రియలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ డీఎస్సీ అవకతవకలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి రాజకీయ పరిణామాలను గుర్తు చేస్తూ చంద్రబాబుకు పెద్దిరెడ్డి ఒక సవాల్ విసిరారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శాసనసభ సాక్షిగా స్పందించారని గుర్తు చేశారు. 'నా కుమారుడు జగన్ తప్పు చేసి ఉంటే సీబీఐ విచారణ జరిపించుకోండి' అని వైఎస్సార్ ఆ రోజు సవాల్ చేసి, కేసును సీబీఐకి అప్పగించి తమ నిజాయితీని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. అదే తరహాలో చంద్రబాబు నాయుడు కూడా ధైర్యంగా ముందుకు రావాలని, మంత్రి లోకేష్‌పై సీబీఐ విచారణ వేయించి తమ ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV