
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, కళాకారులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం అభివృద్ధికి, నేతన్న సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలియజేశారు. జాతికి బట్ట నేసే చేతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా చెప్పుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని, నేతన్నకు భరోసా కల్పించాలని హరీశ్ పేర్కొన్నారు.
హరీశ్ రావు పోస్ట్..
‘చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. నేతన్న బతికితేనే మన చేనేత బతుకుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. తెలంగాణ కోసం పోరాడిన నేతన్నలు నేడు తమ బతుకుల కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలతో చేనేత రంగానికి ఊపిరి పోస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను మరిచి, పథకాలను నిలిపివేసి నేతన్నల జీవితాలను సంక్షోభంలోకి నెట్టింది. మగ్గాలు మూగబోతున్నాయి.. వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. జాతికి బట్ట నేసే చేతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలి. నేతన్నకు భరోసా కల్పించాలి. చేనేతకు పునర్వైభవం తీసుకురావాలి. నేతన్నను కాపాడుకుందాం. చేనేతను బతికించుకుందాం’ అంటూ ఎక్స్లో హరీశ్ రావు పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్