
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)
పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్
రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తో సమావేశం అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని అన్నారు. జనసేన విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. జనసేన జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆరుగ్యారెంటీలపై పోరాటం చేస్తామని అన్నారు. బీజేపీలో పాత, కొత్త నేత అనే తేడా ఉండదని తెలిపారు. చాలా మంది ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఎన్నికలు మరో రెండున్నరేళ్లు ఉండటం వల్ల కొంత సమయం తీసుకుంటున్నారని చెప్పారు. తమకు చాలా చోట్ల అభ్యర్థులు ఉన్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశా, బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అక్కడి కంటే తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై కొందరు కాంగ్రెస్ నాయకులు సైతం మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతుదని అన్నారు. బీజేపీ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చని, కానీ విభేదాలు లేవని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..