
నారాయణపేట, 07 ఆగస్టు (హి.స.)
నారాయణపేట జిల్లా అంటే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జీఐ ట్యాగ్ కలిగిన నారాయణపేట చేనేత చీరలేనని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. చేనేత వృత్తి జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఈ గొప్ప సంప్రదాయాన్ని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారాయణపేట, కోటకొండ, జాజాపూర్ తదితర ప్రాంతాల్లోని చేనేత కుటుంబాలను సందర్శించి వారి పనితీరును స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల ప్రతిభ, నైపుణ్యం అభినందనీయమని, వారు తయారు చేసిన చీరలను తాను కూడా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం చేనేత రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, నారాయణపేట చేనేత ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విశేష ఆదరణ ఉందన్నారు. ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి ఆన్లైన్ ద్వారా నారాయణపేట చీరలకు ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలను మరింత విస్తరించేందుకు మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చేనేత కుటుంబాల యువతను గుర్తించి వెబ్సైట్ నిర్వహణ, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ విక్రయాలపై ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్, మధురై తదితర ప్రాంతాలకు శిక్షణ కోసం పంపించే ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన ఆధునిక చేనేత కేంద్రంలో మగ్గాలు, కుట్టు యంత్రాలు, డైయింగ్ యూనిట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించి టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్ కల్పిస్తామని తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. అలాగే పలువురు సీనియర్ చేనేత కార్మికులను శాలువాలతో సన్మానించి వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వెంకట్ రాములు, మున్సిపల్ చైర్పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్పర్సన్ మంజుల, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారక్, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..