
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.) మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగికంగా వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ఉదయ్ను ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో ఉదయ్ను నిన్న(గురువారం) హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా విచారించారు. ట్రైనీ మహిళా ఐపీఎస్తో పరిచయం, ఉదయ్ ఐ ఫోన్, బెదిరించిన కత్తి ఎక్కడ, సాక్ష్యాలు ఎందుకు దాచిపెడుతున్నావంటూ నగర సీపీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐఫోన్పై ఉదయ్ కృష్ణరెడ్డిని దర్యాప్తు బృందం లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
అయితే విచారణలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డి.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఉదయ్ మేనమామ, తమ్ముడిని కూడా దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. మరో మహిళను కూడా వేధించాడన్న ఆరోపణలపై పోలీసులు దృష్టి సారించారు. ఆధారాలను ముందు ఉంచి మరీ ఉదయ్ కృష్ణారెడ్డిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. ఉదయ్ను రెండు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ ముగియనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్