
అమరావతి, 09 ఆగస్టు (హి.స.)
:నగరంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కేసులో కీలకంగా భావిస్తున్న నిందితులను ఆధారాలతో ఎదుర్కొంటూ సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలు, ఫొటోలు, వీడియోలు, సాంకేతిక ఆధారాలను ముందుపెట్టి నిందితుల నుంచి వాస్తవాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మార్కాపురం నుంచి విజయవాడలోని కృష్ణలంక పోలీస్స్టేషన్కు సాయికృష్ణను తరలించిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మే 6న మార్కాపురం నుంచి సాయికృష్ణను కృష్ణలంక పీఎస్కు తీసుకొచ్చినట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో సాయికృష్ణ తరలింపు సమయంలోని మార్గానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలను అధికారులు సేకరించారు. అలాగే ఆ సమయంలో సాయికృష్ణకు సంబంధించిన ఫొటోలను టాస్క్ఫోర్స్కు చెందిన ఓ కానిస్టేబుల్ తీసినట్లు కూడా సిట్ సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. సేకరించిన ఫొటోలు, వీడియో ఫుటేజీలను నిందితులకు చూపిస్తూ, ఆయా సమయాల్లో ఎవరు ఎక్కడ ఉన్నారు? సాయికృష్ణను ఎలా తరలించారు? మార్గమధ్యలో ఏం జరిగింది? వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం.
విచారణలో భాగంగా సిట్ అధికారులు ఆధారాలను ఒక్కొక్కటిగా ముందు పెట్టడంతో.. తమకు ఏమీ తెలియదని, మొత్తం వ్యవహారం సీఐ నాగరాజుకే తెలుసని కొందరు కానిస్టేబుళ్లు చెబుతున్నట్లు సమాచారం. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తరలించినప్పటి నుంచి కృష్ణలంక పోలీస్స్టేషన్కు తీసుకొచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని పునర్నిర్మించే దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి మరింత కీలక సమాచారాన్ని రాబట్టి కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా సిట్ అధికారులు ప్రశ్నలు కొనసాగిస్తున్నారు. నలుగురు నిందితుల కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో వారిని న్యాయాధికారి శ్రీకాంత్ ఎదుట హాజరుపరిచిన అనంతరం తిరిగి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కస్టడీలో సిట్ అధికారులు సేకరించిన వివరాలు, సాంకేతిక ఆధారాల విశ్లేషణతో కేసు దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ