
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)
బోనాల ఉత్సవాలు సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హిందూ సమాజానికి కీలక పిలుపునిచ్చారు. 'హిందువులారా.. నేటి తరం యువత అయిన జెన్ జీ లను స్పూర్తిగా తీసుకోండి' అని ఆయన కోరారు. నేటి యువత కేవలం ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాకుండా, సనాతన ధర్మం, హిందూత్వ రక్షణ కోసం ధైర్యంగా గళం విప్పుతున్నారని, వారి తీరు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందని బండి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన.. ఆ రెండు పార్టీలకు హిందూ సమాజమన్నా, సనాతన ధర్మమన్నా తీవ్రమైన భయం పట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా ఉన్న హిందువుల బోనాల పండుగకు కేవలం రూ. 20 కోట్లు కేటాయించి, రంజాన్కు రూ.33 కోట్లు కేటాయించడం మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలకు నిదర్శనమని బండి సంజయ్ మండిపడ్డారు.
గోమాత పరిరక్షణ, ఆలయాల రక్షణ, సనాతన ధర్మం కోసం తాను బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. విదేశాలు నిషేధించిన సంస్థల సభలకు రూ. 2.40 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల వాస్తవ చరిత్రను కప్పిపుచ్చి తప్పుడు చరిత్రను ప్రచారం చేస్తున్నారని, కానీ రాబోయే రోజుల్లో హిందూ సమాజం జాగృతమై ముందడుగు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ మతం రంగు పులుముతున్నారని విమర్శించిన ఆయన, ధర్మ పరిరక్షణ లో యువత చూపించే చొరవనే ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రాలోని 150 పోస్టుల భర్తీ ప్రక్రియకు వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడమే రాష్ట్రంలో నెలకొన్న దయనీయ పరిస్థితులకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ. 4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోత్గార్ మేళా ద్వారా ఏకంగా 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, మహాలక్ష్మి రూ. 2,500 సాయం, వృద్ధాప్య పెన్షన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు