
హనుమకొండ, 09 ఆగస్టు (హి.స.)
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అశ్విన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్ర అత్యంత కీలకమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. యువజన కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..