
విజయవాడ, 09 ఆగస్టు (హి.స.)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో గిరిజన సంక్షేమ శాఖ మొత్తం 20 కీలక ఒప్పందాలను (MoUs) కుదుర్చుకుంది.మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతను జోడించి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ ఒప్పందాలలో భాగంగా గిరిజన యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్ల ఆపరేషన్ మరియు వాటి మెయింటెనెన్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.మారుమూల ఐటీడీఏ (ITDA) పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అత్యవసర మందులు, రక్తం మరియు వ్యాక్సిన్లను వేగంగా చేరవేసేందుకు డ్రోన్ మెడికల్ సప్లై వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన కాఫీ సాగును పెంచేందుకు కాఫీ బోర్డుతో మరియు గిరిజన మహిళలు సేకరించే అటవీ ఉత్పత్తులకు ఉన్న వాణిజ్య అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తో ఒప్పందాలు చేసుకున్నారు.గిరిజన మహిళా సంఘాలు (SHGs) తయారు చేసే ఉత్పత్తులకు, పండించే పసుపునకు సరైన మౌలిక వసతులు మరియు మార్కెటింగ్ లింకేజ్ కల్పించడానికి పలు ప్రైవేట్ సంస్థలతో చేతులు కలిపారు.పాడేరు వంటి గిరిజన పర్యాటక ప్రాంతాల్లో స్థానిక కుటుంబాలకు అదనపు ఆదాయం లభించేలా ఓయో (OYO) వంటి సంస్థల భాగస్వామ్యంతో హోమ్‌స్టేలను (Homestays) కూడా ప్రోత్సహించనున్నారు.ఐటీడీఏ పాఠశాలల్లో చదివే గిరిజన విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన ఆధునిక విద్యను అందించేందుకు ప్రత్యేక సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.గిరిజనుల విశిష్ట సంస్కృతిని కాపాడుకుంటూనే, ఆధునిక సాంకేతికత ద్వారా వారిని ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi