
అమరావతి, 12 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడ: నగర శివారులో పశ్చిమ బైపాస్ అంబాపురం క్రాస్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొంది. ఈ ఘటనలో ఏడాదిన్నర చిన్నారి సహా డ్రైవర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన బైరెక్ రాజ్కుమార్ దంపతుల ఏడాదిన్నర కుమారుడు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడికి మెరుగైన వైద్యం చేయించేందుకు చెన్నైలోని ఆసుపత్రికి ఓ ప్రైవేటు అంబులెన్స్లో బయలుదేరారు. ఈ క్రమంలో గన్నవరం నుంచి గుంటూరు వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా వెళ్తుండగా.. నగర శివారులో అంబాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న టిప్పర్ లారీని అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ సపోర్ట్ డ్రైవర్ చోటాన్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడ్ని స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో మృతి చెందాడు. బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఝార్ఖండ్ నుంచి చెన్నైకు తరలిస్తుండగా.. మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ