
హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)
శాసనసభ సమావేశాలు సజావుగా
సాగకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ సభలో నిరంతరం గందరగోళం సృష్టిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నర్సింగరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా సస్పెన్షన్ వేటు వేయించుకోవాలనే కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యా రంగ సమస్యలపై సమగ్ర చర్చ చేపడతామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ, చర్చ జరగకుండా రభస చేస్తూ బీఆర్ఎస్ తన దళిత వ్యతిరేక, ప్రజావ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ల నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22A) అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసత్య ప్రచారాలకు తెరలేపారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు.
ప్రభుత్వ భూములు ఎక్కడైనా నిషేధిత జాబితాలోనే ఉంటాయని, న్యాయస్థానాల ఆదేశాల మేరకు వివాదాలున్న 3.60 లక్షల ఎకరాలను మాత్రమే 22A జాబితాలో ఉంచినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఏదైనా దురుద్దేశం ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి ఇల్లే నిషేధిత జాబితాలో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. కోర్టు కేసులు, వివాదాలు ఉన్న భూములే ఆ జాబితాలో ఉన్నాయని చెబుతూ.. ఇకపై హరీశ్ రావు డ్రామాలు సాగబోవని హెచ్చరించారు. గత పదేళ్లలో ధరణి పోర్టల్ ముసుగులో బీఆర్ఎస్ పెద్దలు సాగించిన వేలాది ఎకరాల భూదోపిడీని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా త్వరలోనే బట్టబయలు చేస్తామని వెంకట్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు