సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళన
వ్యవసాయానికి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మండలం ఎర్కారం సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు.
Farmers


సూర్యాపేట, 12 సెప్టెంబర్ (హి.స.)

వ్యవసాయానికి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మండలం ఎర్కారం సబ్స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు.

జనగాం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ జీడి బిక్షం మాట్లాడుతూ.. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ అందకపోవడంతో సాగు పనులు సైతం ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, తరచూ అంతరాయాల కారణంగా ట్రాన్స్ ఫార్మర్లు, వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఎర్కారం సబ్స్టేషన్ పరిధిలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, రైతులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని బీఆర్ఎస్ నాయకులు, రైతులు కోరారు. అనంతరం సబ్స్టేషన్లోని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande