పంచాయతీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
Seethakka

హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పించడంతో గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ రాష్ట్రంలోని వివిధ గ్రామాల సర్పంచులు శనివారం హైదరాబాద్లో మంత్రి సీతక్కను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీలు బలంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అభివృద్ధి చెందిన గ్రామాలతో తెలంగాణ రాష్ట్రం మరింత బలోపేతమవుతుందని అన్నారు.

73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి మేరకు స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, ఆర్థిక వనరులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే స్ఫూర్తితో గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande