అసెంబ్లీని ముట్టడించిన ఏబీవీపీ.. విద్యార్థి నాయకుల అరెస్ట్
తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Abvp


హైదరాబాద్, 12 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ శాసనసభ సమావేశాలుజరుగుతున్న వేళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ శ్రేణులు భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి.

ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ.. వివిధ మార్గాల్లో నగరానికి చేరుకున్న ఏబీవీపీ నేతలు అసెంబ్లీ పరిసరాల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తీవ్రమైన తోపులాట చోటుచేసుకుంది.

పోలీసుల బందోబస్తు, తోపులాట తీవ్రతరం కావడంతో కరీంనగర్ జిల్లా నుంచి ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన రాకేష్ అనే ఏబీవీపీ విద్యార్థి ఒక్కసారిగా శ్వాస ఆడక స్పృహతప్పి కిందపడిపోయాడు. దీంతో అక్కడ తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొంది. స్పందించిన తోటి విద్యార్థులు, పోలీసులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్ను పిలిపించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆందోళన చేస్తున్న ఇతర విద్యార్థి నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో సమీప స్టేషన్లకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande